రాజ్యాంగ పరిషత్ – భారత రాజ్యాంగ రచన
రాజ్యాంగ రచనా పద్ధతులు ఎన్ని?
సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు.
ఆ దేశ పార్లమెంటు చేత తయారు చేయించడం లేదా రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్తును లేదా సంస్థను ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాంగ రచన చేయడం.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది?
1787లో అమెరికాలో ఫిలడెలిఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు.
1789లో ఫ్రాన్స్ దేశంలో కన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ రచన చేశారు.
రాజ్యాంగ పరిషత్తు అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రకటించిన వారెవరు?
ఎం.ఎన్. రాయ్ (1934)
రాజ్యాంగ పరిషత్తును (Constituent Assembly) ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఎవరు?
క్లిప్స్ రాయబారం – 1942
ఏ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అయింది?
కేబినెట్ కమిటీ – 1946
రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
1946 జూలై, ఆగస్టులో రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు జరిగాయి.
పరిమిత ఓటు పద్ధతి అనగా?
ప్రతి ప్రొవిన్స్ నుండి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు.
రాజ్యాంగ పరిషత్తులోని కొందరు సభ్యులు పాక్షికంగా పరోక్షంగా ఎన్నికైన వారు.
వీరు ప్రొవెన్సియల్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల చేత ఎన్నుకోబడ్డారు. దీనినే పరిమిత ఓటు పద్ధతి అంటారు.
రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య?
389
ఏ చట్టం ద్వారా రాజ్యాంగ పరిషత్తుకు చట్టబద్ధత కల్పించడం జరిగింది?
భారత స్వతంత్ర చట్టం 1947
రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
1946 డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో జరిగింది.
ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించిన వారెవరు?
1946 డిసెంబర్ 13వ తేదీన జవహర్ లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడిన ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఈ ఆశయాల తీర్మానమే రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం.
ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం.
ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 22వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజ్యాంగ పరిషత్తులోని వివిధ అంశాల పరిశీలనకు ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు?
22 కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు,15 మైనర్ కమిటీలను కూడా నియమించడం జరిగింది.
రాజ్యాంగ పరిషత్తు కమిటీలలో అత్యంత ముఖ్యమైన కమిటీ ఏది?
డ్రాఫ్టింగ్ (ముసాయిదా) కమిటీ.
1947 ఆగస్టు 29వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 6గురి సభ్యులతో ముసాయిదా కమిటీని నియమించారు.
రాజ్యాంగ రూపకల్పనకు ఎంత సమయం పట్టింది?
2 సం.రాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది.
మొత్తం 11 సమావేశాలు జరిగాయి.
పనిచేసిన రోజులు – 165
రాజ్యాంగ పరిషత్తు చిట్టచివరి సమావేశం ఎప్పుడు జరిగింది?
1950 జనవరి 24
ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం భారత్ గణతంత్ర ప్రధమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను రాజ్యాంగ పరిషత్తు ఎన్నుకుంది.
భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది?
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.
నోట్: నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ఎన్ డి ఏ ప్రభుత్వం 2017 లో నిర్ణయించింది. (డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 వ జన్మదినోత్సవ సందర్భంగా)
రాజ్యాంగ పరిషత్తు రూపొందించి, ఆమోదించిన అంశాలు ఏవి?
1. 1947 జూలై 22వ తేదీన జాతీయ జెండాను ఆమోదించింది.
2. 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతాన్ని మరియు జాతీయ గేయాన్ని ఆమోదించింది.
3. కామన్వెల్త్ లో భారత సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది.
4. భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగును గుర్తించడం.
5. దేవ నాగరి లిపిలో గల హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా సెప్టెంబర్ 14న 1949లో ఆమోదించింది.
6. 1952 ఏప్రిల్ 17 వరకు తాత్కాలిక పార్లమెంటు గా పని చేసింది.
7. రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసన సభగా కూడా పనిచేసింది.
స్వతంత్ర శాసనసభ 1947 నవంబర్ 17వ తేదీన సమావేశమై మొట్టమొదటి స్పీకర్ గా జీ.వి. మౌలాంకర్ ను ఎన్నుకుంది.
8. మొట్టమొదటి రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాదను రాజ్యాంగ పరిషత్తు జనవరి 24 1950లో ఎన్నుకుంది.
రాజ్యాంగ పరిషత్తులో అతి ముఖ్యమైన కమిటీ ఏది?
ముసాయిదా కమిటీ
రాజ్యాంగ పరిషత్తులు అతిపెద్ద కమిటీ ఏది?
సలహా కమిటీ
ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు?
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
ఏ చట్టాన్ని భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం అని చెప్పవచ్చు?
భారత ప్రభుత్వ చట్టం 1935.
అందుకే భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలుగా వర్ణిస్తారు.
రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతులు ఏవి?
రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్తు ఏ అంశాన్ని ఓటింగ్ ద్వారా ఆమోదించలేదు.
రాజ్యాంగ రచనలో రెండు పద్ధతులను అనుసరించారు ఒకటి సమ్మతి పద్ధతి రెండవది సమన్వయ పద్ధతి.
సమ్మతి పద్ధతి అనగా?
ఒక సమస్య లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చల ద్వారా ఇంచుమించు అందరూ సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతి.
ఈ పద్ధతి ద్వారా సమాఖ్య వ్యవస్థ ప్రాంతాల ప్రత్యేకత, భాషకు సంబంధించిన అంశాలను పరిష్కరించారు.
సమన్వయ పద్ధతి అనగా?
ఒక సమస్యపై మధ్య మార్గాన్ని సాధించడం.
పరస్పర వ్యతిరేక వాదనలు ఉన్నప్పుడు సుదీర్ఘంగా చర్చించి ఒక అభిప్రాయానికి రావడం.
భారత రాజ్యాంగంలోని చాలా అంశాలను ఈ పద్ధతి ద్వారానే అంగీకరించారు.
భారత రాజ్యాంగంలో భారతీయులు స్వతహాగా ఏర్పాటు చేసుకున్న మౌలికంగా ఉన్న అంశాలు ఏవి?
1. పంచాయితీరాజ్ వ్యవస్థ
2. ఏక పౌరసత్వం
3. అఖిల భారత సర్వీసులు
4. ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ
5. రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం
6. రక్షిత వివక్షత
7. ఆర్థిక సంఘం
8. కేంద్ర/ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్